Sundarakanda 8 - సుందరకాండ 8

  Sundarakanda 8 - సుందరకాండ 8

Sundarakanda 8 - సుందరకాండ 8
 Sundarakanda 8 - సుందరకాండ 8

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

తల్లీ నిన్ను చూచిన దాదిగా త్వరపడు చుంటిని మరలిపోవగ

భీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు

రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను

అని మారుతి సీత పదముల వ్రాలె సెలవు గైకొని రివ్వన మరలె || 351 ||                             

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము బెంచి

పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పుడమిని క్రుంగె

సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీ రామునకు తెలియజేయగ

మారుతి మరలెను అతి వేగముగ ఉత్తర దిశగా వారిధి దాటగ  || 352 ||                                 

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

గరుడిని వోలె శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని

మార్గ మధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగ క్షేమము కనుగొని

దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గని

విజయ సూచనగ గర్జన చేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు || 353 ||                     

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

మహేంద్రగిరి శిఖరాగ్రమున బారులు తీరిచి వానరులుండిరి

జాంబవదాది వీరులందరు ఎదురు తెన్నెలు కాయుచుండిరి

మారుతి జేసిన సింహనాదమును విని గుర్తించి హర్షించి హసించిరి

తరుశాఖలపై పైకి ఎగసిరి జెండాలవోలె రెమ్మల నూపిరి  || 354 ||                                       

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

కపి వీరులను చేర రమ్మని జాంబవంతుడు పలికెను ప్రీతిని

ఆ వినుపించెడు భీకర నాదము మారుతి చేసేను సింహ నాదము

ఊరక చేయుడు ఇంతటి నాదము సీతను కనుకొని యుండుట ఖాయము

అని తీరుగ బల్కె జాంబవంతుడు అందరిలోను అనుభవజ్ఞుడు || 355 ||                               

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

సుందరమైన మహేంద్రగిరిపైన సెలఏట దిగి తానమాడి

జాంబవదాది పెద్దలందరికి వాయు నందనుడు వందనములిడి

చూచితి సీతను చూచుతి సీతను అను శుభవార్తను ముందుగ బలికెను

కపివీరులు హనుమంతుని బొగడిరి ఫలముల నొసగి సత్కరించిరి    || 356 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

హనుమా నీవు మహా శూరుడవు స్వామి భక్తి పరాయణుండవు

వారిధి దాటి లంకను జేరి సీతను జూచి మరలి వచ్చితిచి

ఒంటిగ ఇంతటి సాహస కార్యము ఎటు చేసితివో విన గోరుదుము

అని కోర్కెబడిరి అంగదాదులు పరివేష్టించిరి వానర వీరులు   || 357 ||   

మారుతి తన లంకా యానమును వానరులకు వివరించి తెల్చెను

అంగదాదులు ఆలకించిరి ఆనందముతో పొంగిపోయిరి

రామలక్ష్మణ సుగ్రీవాదులకు ఈ శుభవార్తను వేగదెల్పుటకు

కపికుంజరుని ముందు నిడుకొని కపులందరు కిష్కింధకు సాగిరి  || 358 ||   

సుగ్రీవుని మేనమామ కలడు దధిముఖుండను వానరోత్తముడు

ఆతనిచే కాపాడు బడునది కపిరాజునకు కడు ప్రియమైనది

దివ్యమైనది విశాలమైనది ఒరులు చొరరాని మధువనమ్మది

అంగదాదులా వనమున బడిరి అదుపాజ్ఞలేక అల్లరి చేసిరి    || 359 ||                                  

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

మధువు గ్రోలి గ్రోలి పారబోసిరి మధువనమునంత బీడు చేసిరి

అడ్డగించిన దధిముఖాదులను అడలబాది మరి వెడల గొట్టిరి

ఆడిరి పాడిరి గంతులు వేసిరి శాఖల విరిచి తరువుల గూల్చిరి

మధువనమును కపులందరు చేరి అదుపాజ్ఞలేక ధ్వంసము చేసిరి    || 360 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

దధిముఖుండు పరివారము దోడ్కొని పరుగున బోయి కిష్కింధ జేరుకొని

జాంబవ దంగద హనుమదాదులు మధువనమున బడి మధువు గ్రోలిరని

అడ్డగించిన తమపై తలపడి ఉన్మాదమున హింసించినారని

మధువనమునంత బీడు చేసిరని విన్నవించుకొనె సుగ్రీవుని గని      || 361 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

జయ హనుమంతుడు సీత జాడగని జయెత్సాహమున మరలి యుండునని

ఆనందముతో అంగదాదులు మధువనమునబడి త్రాగి యుందురని

అడ్డగించిన దద్ధిముఖాదులను మత్తిల్లి వారు కొట్టి యుందురని

సుగ్రీవుడు కడు సంతోషముతో విన్నవించెను రాజసుతులతో || 362 ||                                

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

సీత జాడగని ఉత్సాహమున మరలి వచ్చెడు వానర వీరుల

జాంబవ దంగద హనుమదాదుల వేగమే రమ్మని కబురంపమని

సీత క్షేమమను తెలుపు సువార్తను మారుతి పలుక తా వినవలయునని

రామచంద్రుడు సుగ్రీవునితో దివ్యస్వరమున పలికె ప్రీతితో    || 363 ||                                  

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

సీత జాడగని వచ్చుచుండిన కపివరులందరు క్షమార్హులని 

వారితోడ ఇక కలహము వలదని జరిగిన దానిని మరచి పొమ్మని

తడవు చేయక మరలి పొమ్మని వారందరిని వేగ పంపుమని

దధిముఖునితో సుగ్రీవుడు బలికె ఆదరించి ప్రీతిగ నంపె  || 364 ||                           

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

కపిరాజంపిన కబురందగ కపివీరులు కిష్కింధకు వెడలగ

జయ హనుమంతుడు ముందు నడువగ జయజయ ధ్వనులతో ముందుకు సాగగ

రాను రాను ఆ కోలాహలము చేరుకొనెను కిష్కింధాపురము

రామలక్ష్మణ సుగ్రీవాదులు ప్రస్రవణగిరి పైన వేచిరి   || 365 ||                                              

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

జాంబవ దంగద హనుమదాదులు ప్రస్రవణగిరి చేరినారు
రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందన మిడినారు

ఆంజనేయుడు శ్రీరామునితో చూచుతి సీత నని శుభవార్త దెల్పె

ఆనందాశ్రువులు రాలగ రాముడు మారుతి నెంతో అభినందించె  || 366 ||   

నలువంకల ఉత్సాహము పొంగగ ప్రతి మెమున ఆనందము చిందగ

రామలక్ష్మణ సుగ్రీవాదులను వానరులందరు పరివేష్టింపగ

హనుమా! సీతను ఎట్లు గాంచితివి? ఎట్లున్నది సీత ఏమి తెల్పినది?

అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పె తన లంకాయానము  || 367 ||   

దక్షిణ దిశగా వారిధి నడుమ సుందరమైన లంకయున్నది

శతయెజనముల వారిధి దాటి ఒంటిగ నేను లంక జేరితి

అడుగడుగున నే లంక వెదకితి ఆగి ఆగి నే కలయ జూచితి

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను  || 368 ||                   

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

ఎల్ల రాక్షసుల గృహములు వెదకితి అంతఃపురముల పరిశీలించితి

ఎందు వెదకినా సీతను గాంచగ నిరాశ జెంది కడు చింతించితి

ఏమియు తోచక తిరిగిన తావుల తిరిగి తిరిగి తిరిగి తిరిగి చూచుతి

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను  || 369 ||                   

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

చూడ మరచిన ఆశోక వనమును వెతక సాగితిని చివరకు నేను

మాసిన పీత వసనము దాల్చిన కటిక నేలపై కూర్చొని యున్న

రాక్షస వనితల క్రూర వలయమున చిక్కి యుండిన సీతను గాంచితి

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను  || 370 ||                   

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

అశోక వనికి రావణాసురుడు సీతను జూడ ఏతెంచినాడు

చెంతకు జేరి కామాంధుడై నిలిచె నోటికి వచ్చిన దెల్ల పలికె

సుడిగాలి బడిన కదళీ తరువువలె కటిక నేలపై జానకి తూలె

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 371 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

శీఘ్రముగా నను రాముని జేర్చుము త్రికరణ శుద్దిగా శరణు వేడుము

లేక్కున్న నీవు నీ లంకయును అనతి కాలమున నాశనమౌను

అని సీత పలికె దివ్యస్వరమున తృణముకన్న రావణుడే హీనమన

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 372 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

నను వరించిన నిను పూజింతును నను కాదనిన నిను వధింతును

రెండు నెలల గడు వున్నది ఇంకను ఈ లోపుగ బాగోగులు కనుగొను

అని రావణుడు గర్జన చేయుచు మరలిపోయెను మంటల గ్రక్కుచు

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 373 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

అసురులచే బాధలు పడలేక సీతామాత బ్రతక నోర్వక

తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనెను

అంతట రామా! నిన్నే దలచితి తరువుపై నుండి నీ కథ పలికితి

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను  || 374 ||                   

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

తల్లి మనసు శాంతింపగా గని సూక్ష్మరూపమున జేరబోతిని

రామదూతనని తెలుపుకొంటిని అంగుళీయకమును అందజేసితిని

ఆనందాశ్రులు జారగ జానకి అంగుళీయకమును కనుల కద్దుకొనె

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 375 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

అంగుళీయకమును సీత గైకొనెను నినుగని నటుల ఆనందించెను

చిత్రకూటమున కాకాసుర కథ కన్నీరొలుకగ తెలిపెను గురుతుగ

చెంగు ముడినున్న చూడామణీని ప్రేమ మీరగ పంపెను గురుతుగ

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 376 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

నీట బుట్టినది పూజలందినది చూడామణి యని పేరు బొందినది

యజ్ఞముచే సంతృప్తిని జెంది ఇంద్రుడు జనకుని మెచ్చి ఇచ్చినది

సీతారాముల పెండ్లి సమయమున జనకుడు ప్రీతిగ సీత కొసగినది

అని రాముడు ఆ చూడామణిని అశ్రులు జారగ స్వీకరించెను   || 377 ||   

చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని

మాటలిరాని ఆనందముతో ఆశ్రులు నిండిన నయనాలతో

బహురీతుల హరీశుని బొగడి హనుమా! ఇంకను వినగోరుదునన

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను  || 378 ||                   

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

సీతామాతకు వందనములిడి మరలి వచ్చుటకు సెలవు గోరితి

రాలు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా

కొండంతగ నా కాయము బెంచితి అశోకవనము ధ్వంసము చేసితి

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 379 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

అసురులు నాపై దాడి చేయగ కింకరులను జంబుమాలిని గూల్చితి

మంత్రి కుమారుల సేనాపతుల చతురంగ బలాల రూపుమాపితి

రాజకుమారుడు అక్షుని జంపితి ఇంద్రజిత్తుతో పోరు సల్పితి

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 380 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

ఇంద్రజిత్తు రణమందున విసిగెను బ్రహ్మాస్త్రము ప్రయెగము జేసెను

బ్రహ్మవరమున బ్రహ్మాస్త్రము నన్ను క్షణకాలము బంధించి యుంచెను

అది తెలియని నిశాచరులు నన్ను నారచీరల బంధించి మురిసిరి

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను  || 381 ||                   

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రావణుతోడ సంవాదమునెంది బంధములకు నేలొంగి యుంటిని

అనుకొనినటులే అసురులు నన్ను రావణుకడకు తిన్నగ జేర్చిరి

నా పలుకులు విని రావణుడలగి ఆజ్ఞాపించెను నను వధింపుడని

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 382 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రావణు తమ్ముడు విభీషణుడు అన్నను జేరి ప్రసన్నుని జేసెను

దూతను జంపుట ధర్మము కాదని దండింపగ తగు విధములు దెల్చెను

వాలము గాల్చి నన్ను వదలుడని దశకంఠుడు గర్జించి పలికెను

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 383 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

ఏ మంటల నా వాలము గాల్చిరో ఆ మంటల నే లంక గాల్చితి

ఎల్ల రాక్షసుల గృహముల గాల్చితి విభీషణుని గృహము వదలితి

లంకాపురము మంటలపాలై నేల గూలెను బూడిదపాలై

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 384 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

లాంగూలజ్వాల చల్లార్చుకొని అశోకవనము వేగ జేరితి

సీత క్షేమముగ ఉండుట గాంచి నా భాగ్యమని ఆనందించితి

సీతామాత వాత్సల్యపూరిత ఆశీస్సుల నే పొందగలిగితి

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 385 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

నిరతము నిన్నే తలచుచున్నది క్షణమెక యుగముగ గడుపుచున్నది

రెండు నెలల గడువు తీరక మునుపే వేగమెవచ్చి కాపాడు మన్నది

రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుప మన్నది

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 386 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

వానరరాజు సుగ్రీవుని సేనలో నన్ను మించిన శూరులు గలరని

వాయువేగ మనోవేగముగల జాంబవ దంగద యెధులు గలరని

తృటిలో లంకను కూల్చివేతురని సీతామాతకు ధైర్యము గొలిపితి

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 387 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమె లంకకు గొనివత్తునని

రామలక్ష్మణుల అగ్ని శరములకు రావణాదులు కూలుట నిజమని

ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపి నే మరలి వచ్చితిని

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 388 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

అందరు కలసి అయెధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని

సీతారామ పట్టాభిషేకము కనుల పండువుగ జరిగి తీరునని

ఎన్నోరీతుల సీతామాతకు ధైర్యము గొలిపి నే మరలి వచ్చితిని

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 389 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

ఆనందముతో అశ్రులు జారగ సీతామాత నను దీవించగ

పదముల వ్రాలి నే పయనమైనది పదముల రాక నే మరలి వచ్చితిని

ఒప్పలేదు కాని ఎపుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందునా

అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను || 390 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

సీత క్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండిన

నేటితోడ మా రఘు కులమంతా అంతరించి యుండెడిది కదా

మమ్మీతీరుగ ఉద్ధరించిన మారుతికి ఏ మివ్వగలనని

సర్వమిదేనని కౌగిట జేర్చును హనుమంతుని ఆజానుబాహుడు     || 391 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

నలుగురు శ్రద్దతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా

సీతారామ హనుమానులు సాక్షిగ సర్వజనులకు శుభములు కలుగగ

కవికోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున

శ్రీగురు చరణ సేవా భాగ్యమున పలికెద సీతా రామ కథా!     || 392 ||                                  

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

అథ క్షమా ప్రార్థనా

యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్!

తత్సర్వం క్షమ్యతాం దేవ నారయణ నమెస్తుతే!!

 అథ భగవత్సమర్మణమ్ 

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ద్యాత్మనా వా ప్రకృతే స్వభవాత్

కరోమి యద్యత్ స్కలం పరస్యై నారాయణాయేతి సమర్పయామి

శ్రీ ఆంజనేయ మంగలాష్టకం 

గౌరీశివవాయువరాయ అంజనికేసరిసుతాయ చ

అగ్నిపంచకజాతాయ ఆంజనేయాయ మంగళమ్

వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే

పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళమ్

పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ

కౌండిన్యగోత్ర జాతాయ ఆంజనేయాయ మంగళమ్

సువర్చలాకళత్రాయ చతుర్బుజధరాయ చ

ఉష్ట్రారూఢాయ వీరాయ ఆంజనేయాయ మంగళమ్

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ

తప్తకాంచనపూర్ణాయ ఆంజనేయాయ మంగళమ్

కరుణారసవర్ణయ ఫలాపూపప్రియాయ చ

మాణిక్యహారకంఠాయ ఆంజనేయాయ మంగళమ్

భక్తరక్షణ శీలాయ జానకీశోకహారిణే

సృష్టికారణభూతాయ ఆంజనేయాయ మంగళమ్

రంభావనవిహారాయ గంధమాదనవాసినే

సర్వలోకైకనాథాయ ఆంజనేయాయ మంగళమ్

Post a Comment

0 Comments