Sundarakanda 3 - సుందరకాండ 3

 Sundarakanda 3 - సుందరకాండ 3

Sundarakanda 3 - సుందరకాండ 3
Sundarakanda 3 - సుందరకాండ 3

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

ఆ దీప్యమాన భవన ప్రాంతమున తను కూర్చొనిన తరువు క్రిందున

కృంగి కృశించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను

ఉపవాసముల వాడిపోయిన నిరువు గప్పిన నిప్పుకణమును

చిక్కిన వనితను మారుతి గాంచెను రాక్షస వనితల క్రూర వలయమున   || 101 ||   

మాసిన పీత వసనమును దాల్చిన మన్నున బుట్టిన పద్మమును

పతి వియెగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని

మాటి మాటికి వేడి నిట్టూర్పుల సెగలను గ్రక్కే అగ్ని జ్వాలను

చిక్కిన వనితను మారుతి గాంచెను రాక్షస వనితల క్రూర వలయమున    || 102 ||   

నీలవేణి సంచాలిత జఘనమును సుప్రతాష్టను సింహ మధ్యమును

కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను రతీదేవివలె వెలయు కాంతను

పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధి పడి మునిగిన తారను

చిక్కిన వనితను మారుతి గాంచెను రాక్షస వనితల క్రూర వలయమున   || 103 ||   

పతి చెంతలేని సతి కేలనని సీత సోమ్ముల దగిల్చె శాఖాల

మణిమయ కాంచన కర్ణ వేష్టములు మరకత మాణిక్య చెంపసరాలు

రత్నఖచితమౌ హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు

రాముడు దెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించె మారుతి  || 104 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

సీత నెత్తుకొని గగన మార్గమున లంకేశ్వరుడు ఏగు సమయమున

ఉత్తరీయమును కొన్ని సొమ్మలను ఋష్యమూకమున జానకి విసరెను

ప్రస్తుతమున్న వసనము సొమ్ములు వెనుకటి వాటితో కలసె పోలికలు

రాముడు దెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించె మారుతి  || 105 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

సర్వ సులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరీ మాత?

కౌసల్యా సుప్రజారాముని సీతగాక మరి ఎవరీ మాత?

వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరీ మాత?

ఆహా! కంటి కను గొంటి సీతనని పొంగి పొంగి ఉప్పొంగె మారుతి  || 106 ||                             

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

పూవులు నిండిన పొలము లందున నాగేటి చాలున జనన మందిన

జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడాలైన

సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్యరాజ్య లక్ష్మి సహితము

అంతటి మాతకా కాని కాలమని మారుతి వగచె సీతను కనుగొని      || 107 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

శత్రుతాప కరుడు మహా శూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన

ఆశ్రితజన సంరక్షకుడైన శ్రీరఘురాముని ప్రియసతియైన

పతి సన్నిధియే సుఖమని ఎంచి పదునాల్గేండ్లు వనమున కేగిన

అంతటి మాతకా కాని కాలమని మారుతి వగచె సీతను కనుగొని      || 108 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

బంగరు మేని కాంతులు మెరయ మందస్మిత ముఖ పద్మము విరియ

హంసతూలికా తల్పమందున రాముని గూడి సిఖింపగ తగిన

పురుషోత్తముని పావన చరితుని శ్రీరఘురాముని ప్రియసతియైన

అంతటి మాతకా కాని కాలమని మారుతి వగచె సీతను కనుగొని      || 109 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

మూడు జాముల రేయి గడువగా నాల్గవ జాము నడుచుచుండగా

మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు

క్రతువు లొనర్చు షడంగ వేదవిదుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు

శోభిల్లు శింశుపా శాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను  || 110 ||                              

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రావణాసురుడు శాస్తోక్తముగ వేకువనే విధులన్ని యెనద్చెను

మదోత్కటుడై మదన తాపమున మరి మరి సీతను మదిలో నెంచెను

పలువురు కాంతలు పరి సేవింపగ రత్నకాంతులు దిశలు నిండగ

దశకంఠుడు దేదీప్యమానముగ వెడలెను అశోక వనము చేరగ  || 111 ||                              

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

జలములు నింపిన భృంగారములతో కొందరు యువిదలు ముందు నడవగ

కాంచన దీప స్తంభములతో కొందరు కాంతలు వెంట నడవగ

ఛత్ర చామర మధు పాత్రలతో కొందరు రమణులు తోడు నడువగ

దశకంఠుడు దేదీప్యమానముగ వెడలెను అశోక వనము చేరగ  || 112 ||                              

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విద్యుల్లతలవలె

మధువు గ్రోలిన పద్మముఖుల ముంగురులు రేగె భృంగములవలె

క్రీడల తేలిన కామినీమణుల నిద్రలేమి పడు అడుగులు తూలె

దశకంఠుడు దేదీప్యమానముగ వెడలెను అశోక వనము చేరగ  || 113 ||                              

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

మందగమనల అందెల రవళులు ఒడ్డాణపు చిరు గజ్జల రవములు

మెల్ల మెల్లగ చేరువ కాగ మారుతి గాంచెను ఆశ్చర్యముగ

నూర్గురు భార్యలు సుర కన్యలవలె పరి సేవింపగ దేవేంద్రనివలె

దశకంఠుడు దేదీప్యమానముగ వెడలెను అశోక వనము చేరగ  || 114 ||                              

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

జీరాడెడు ఉత్తరీయమును గని విలాసముగ కై దండగా గొని

ఏతెంచెడు మహా బలశాలిని తపోధనుని విశ్రవసు కుమారుని

మధువు గ్రోలి మత్తిల్లిన వాని రక్తారుణ విశాలనేత్రుని

అంతటి యశో విశాలుని కనుకొని మారుతి దలచె దశకంఠుడేనని     || 115 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రావణుని జూడ వేడక కలిగి క్రింది కొమ్మలకు మారుతి జరిగెను

లంకేశుని మహా తేజము గని మారుతి గూడ విభ్రాంతి జెందెను

దశకంఠుడు సమీపించి నిలిచెను సీతపైననే చూపులు నిలిపెను

సుడిగాలి బడిన కదళీ తరువువలే కటిక నేలపై జానకి తూలె  || 116 ||                   

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

దిశలు దహించే అగ్నియై దోచె చేజిక్కిన నాగ కన్యయై దోచె

నలువంకల రక్షణకై జూచె మనమున రాముని నమ్రత గొలిచె

తొడలు జేరుచ్కొని కడుపును దాచె కరములు ముడిచి చనుగవ గాచె

సుడిగాలి బడిన కదళీ తరువువలె కటిక నేలపై జానకి తూలె   || 117 ||   

"ఓ సీతా! ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఏల చింత?

ఎక్కడి రాముడు ఎక్కడి అయెధ్య? ఎందుకోస మీ వనవాస వ్యధ?

నవ యౌవ్వన త్రిలోక సుందరీ నీ కెందుకు ఈ మునివేషధారి?"

అని రావణుడు కామాంధుడై నిలిచె నోటికి వచ్చిన దెల్ల పలికె  || 118 ||                                

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"సిగ్గెందుకు ఓ మెహనాంగి చేసికొందు నిను నా అర్థాంగి

భయమెందుకు ఇం దెవ్వరు లేరు దాచుకొనకు నీ అందాల తీరు

పరకాంతల హరించి రమించుట పరమ ధర్మము మా కులమంతట"

అని రావణుడు కామాంధుడై నిలిచె నోటికి వచ్చిన దెల్ల పలికె  || 119 ||                                

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

మాసిన పీత వసనము దాల్చుట నేల బరుండుట ఉపవాసముండుట

దీనముగా లోలోన కుందుట సుముఖముగా మాటాడకుండుట

అందము కాదు ఆనందము కాదు మళ్ళిన వయసు మళ్ళీ రాదు

అని రావణుడు కామాంధుడై నిలిచె నోటికి వచ్చిన దెల్ల పలికె  || 120 ||                                

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

దివ్య సుందరీ లేరు నీకు సరి ముల్లోకముల నీకు నీవే సరి

సృష్టికర్త తన చతురతనంతను పొందుపరచి సృజించెనో నిను

అదను దాటిన ముదుసలులైన నిదుర బోరు నీ సొగసులు గాంచిన

అని రావణుడు కామాంధుడై నిలిచె నోటికి వచ్చిన దెల్ల పలికె  || 121 ||                                

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

బంగరు పాత్రల మధుర రసాలు మణిమయ రత్న సువర్ణ భూషలు

చిత్ర విచిత్రమౌ దివ్యాంబరములు కాలగరు సుగంధ ధూపములు

నృత్యగీతములు మృదుతల్పములు నను గూడిపొందు స్వర్గ సుఖములు

అని రావణుడు కామాంధుడై నిలిచె నోటికి వచ్చిన దెల్ల పలికె  || 122 ||                                

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రాముడు నీకు సరిగానివాడు నిను సుఖపెట్టడు తను సుఖపడడు

గతిచెడి వనమున తిరుగుచుండెనో తిరిగి తిరిగి తుదకు రాలిపోయెనో

మరచిపొమ్ము ఆ కొరగాని రాముని వలచి రమ్ము నను యశోవిశాలుని

అని రావణుడు కామాంధుడై నిలిచె నోటికి వచ్చిన దెల్ల పలికె || 123 ||                                 

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

చారువృత్త పయెధర భోగిని చలిత లలిత సుమధ్య విభాగిని

రతి విహార విశాల నితంబిని లీలా లోలిత నీలవేణి

నను గోరని నిను బలత్కరించను నను కాదను నిను కనికరించను

అని రావణుడు కామాంధుడై నిలిచె నోటికి వచ్చిన దెల్ల పలికె  || 124 ||                    

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రాముడు వచ్చుట నన్ను గెల్చట నిన్ను పొందుట కలలోని మాట

బల విక్రమ ధన యశము లందున అల్పుడు రాముడు నా ముందెందున

యమ కుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేల?

అని రావణుడు కామాంధుడై నిలిచె నోటికి వచ్చిన దెల్ల పలికె  || 125 ||                                

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

చంద్రముఖి నీపైని నా చూపు మరలకున్నదే మరియే వైపు

చేసికొందు నిను పట్టపు రాణిగ చూచుకొందు నా శుభముల రాశిగ

జలధి సమీప కుం జలముల దేలి రమియింతము రమ్ము మధువును గ్రోలి

అని రావణుడు కామాంధుడై నిలిచె నోటికి వచ్చిన దెల్ల పలికె  || 126 ||                                

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

నిరతము పతినే మనమున దలచుచు క్షణమెక యుగముగ కాలము గడుపుచు

రావణ గర్వమదంబుల ద్రుంచు రాముని శౌర్య ధైర్యముల దలచుచు

శోకతప్తయై శిరమును వంచి తృణమును ద్రుంచి తన ముందుంచి

మారు బెల్కె సీత దీన స్వరమున తృణముకన్న రావణుడే హీనమన || 127 ||                                   

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

నన్ను కామించుట మహా పాపము నీ కాంతలతో పోందుము సుఖము

నీ కాంతలు పరుల పాలైనపుడు యెచించుము నీ మనసెటులుండు?

నీ సతులందున తనివి నొందిక పరకాంతల ఆశించి నశించకు

అని పల్కె సీత దీన స్వరమున తృణముకన్న రావణుడే హీనమన    || 128 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

తెలివి బల్కెదవు అతి వినయముగా హితులే లేరా నిజము దెలుపగా?

సత్యవాక్కు నీకు హితము గాదని విభీషణాదులు మిన్నకుండిరా?

నీ వంటివాడు రాజయ్యనేని సర్వనాశము కాకుండునేమి?

అని పల్కె సీత దీన స్వరమున తృణముకన్న రావణుడే హీనమన    || 129 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రవిలేని కాంతి ఎటులుండగలదు? సీతారాముల విడదీయ వలదు?

రామచంద్రుని ప్రియసతి నేను నను కోరుకొని పొందకు హాని

శ్రితజన పాలుని నా స్వామిని శరణు వేడుము మన్నింపుమని

అని పల్కె సీత దీన స్వరమున తృణముకన్న రావణుడే హీనమన    || 130 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమ్మున

పురుష సింహముల గాలికి బెదరి పారిపోతివి శునకము మాదిరి

యమ కుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకీ వంచన లేల?

అని పల్కె సీత దీన స్వరమున తృణముకన్న రావణుడే హీనమన    || 131 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

ఓయి రావణా! నా మాట వినుము శ్రీ రామునితో వైరము మానుము

శీఘ్రముగా నను రాముని జేర్చుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము

నిను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందు నా కరుణామూర్తిని

అని పల్కె సీత దీన స్వరమున తృణముకన్న రావణుడే హీనమున  || 132 ||   

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ                      ఓ సీతా! నీ వెంత గడసరివే ఎవరితో ఏమి పల్కచుంటివే

ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు

నీపై మెహము నను బంధించెను లేకున్న నిను వధించి యుందును

అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు                || 133 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

నీ కొసగిన ఏడాది గడువును రెండు నెలలో తీరిపోవును

అంతదనుక నిన్నంట రాను ఈ లోపున బాగోగులు కనుగొను

నను కాదను నిను కనికరించను పాకశలకే పంపించెదను

అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు    || 134 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

నను పతిగా వరింపని నిన్ను పాకశాలలో తరిగించెదను

రుచులు రుచులుగా వండించెదను నోరూరగ విందారగించెదను

నాతో సుఖమె లేక మరణమె కోరుకొనుము నీకేది మెదమె

అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు    || 135 ||                                  

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రావణుడాడిన కఠినోక్తులు విని రాణులందరు నివ్వెరబోయిరి

దేవగంధర్వ కాంతలెందరో తమలో తాము భీతి జెందిరి

కను సైగలతో ముఖ భంగులతో వైదేహినెంతో ఊరడించిరి

శోభిల్లు శింశుపా శాఖలందున మంటల గ్రక్కుచు మారుతి గాంచెను  || 136 ||          

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

ఓ రావణా! నీ క్రొవ్విన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి?

కామాంధుడా! నీ క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి?

పతి ఆజ్ఞలేక ఇటుల్లుంటిగాని తృటిలో నిన్ను దహింపనా ఏమి?

అని పల్కె సీత దివ్య స్వరమున తృణముసన్న రావణుడే హీనమున || 137 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు కొరకొర జేచుచు నిప్పులు గ్రక్కుచు

తన కాంతలెల్ల కలవర మెందుగ గర్జన చేయుచు దిక్కులదరగ

సీత నెటులైన ఒప్పించుడని ఒప్పుకొమననిచో భక్షించుడని

రావణాసురుడు ఆజ్ఞాపించెను కావలియుండిన ఆసుర వనితలను    || 138 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

శృతిమించి పలుకు లంకేశుని గని ధాన్యమాలిని పతిని జేరుకొని

కోరకయున్న సీత యెందుకని కోరికయున్న తనను బొందుమని

వలపు లొలుకగా పలుకులు పలికి తెలివిగ పతిని మరలించుకొని

సతులందరితో వెడలెను హాయిగ దివ్య భవనమున సుఖముల దేలగ   || 139 ||                  

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

చతుర్ముఖ బ్రహ్మ మానస పుత్రుడు చతుర్థ ప్రజాపతి పులస్త్యుడు

పులస్త్యుని సుతుడు విశ్రవసుడు తేజోవంతుడు ఋషి సత్తముడు

విశ్రవసుని సుతుడు రావణుండు మహాబాహుడు దశకంఠుడు

అంతటి యశో విశాలుని గొను మని రాక్షస వనితలు వేచిరి సీతను    || 140 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

దేవేంద్రాదులు దిక్పాలకులు లంకేశునాన మీరజాలరు

సూర్యడు తగుసరి ఎండ గాయును వాయువు మెల్లగ చల్లగ వీచును

వరణుడడలి సమ వృష్టి నొసగును ఋతువులు నిత్య వసంతము లీనును

అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలు వేచిరి సీతను     || 141 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రాణులందరిలో మహారణిగ రాణింపుము లంకేశుని రాణిగ

మండోదరి కన్న నిన్ను మిన్నగ రాక్షసేంద్రుడు ప్రేమించునుగ

దశకంఠుడు నిన్ను ప్రియతమ భార్యగ భావించుటయే నీ భాగ్యముగ

అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలు వేచిరి సీతను     || 142 ||                        

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

సీతా! నీవు రాముని దలచుట నీకై నీవు కష్టాలు కోరుట

అడవుల దిరిగెడు వల్కలధారి నిను కాపాడ ఏమున్నది దారి?

ఇంతట రాముని మరచుట మేలు ఇకపై నిన్ను రావణుడేలు

అని బెదదించిరి రాక్షస వనితలు సీతను వేచిరి క్రూర కర్మలు  || 143 ||                                 

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

మా పలుకులు సమ్మతింపవేని నీ మనసును మరల్చు కొనవేని

నిన్ను హింసించి వధించెదము ముక్క ముక్కలుగ పంచుకొందుము

మధువు గ్రోలుచు ఆరగించెదము ఊరగాయవలె నంచుకొందుము

అని బెదదించిరి రాక్షస వనితలు సీతను వేచిరి క్రూర కర్మలు  || 144 ||                                 

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

ఓ నిశాచర వనితల్లారా లోక విరుద్దపు మాటలికేలా?

మేము మానవులము మీరు దానవులు మీ రాజుకు నే భార్యగా తగను

పతియే దైవము సతికి సర్వము చెదరని బంధము అది మా ధర్మము

అని పల్కె సీత దీనస్వరమున రాక్షస వనితల క్రూర వలయమున    || 145 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

నను వధింపుడు మీ శ్రమ తొలగు నను భక్షింపుడు ఆకలి తీరు

నను హింసించి వధించి వేసినను దశకంఠుని వరింప నొల్లను

ఏ మాత్రము మీ మాటలు వినను ఏ నాటికి మీ మాయల బడను

అని పల్కె సీత దీనస్వరమున రాక్షస వనితల క్రూర వలయమున    || 146 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

ఓ రామా! లక్షణా! వినరాదా ఈ సీత కథ కష్టాలే కదా

రావణుండు నను హరియించినాడు లంకాపురమున బంధించినాడు

క్రూర రాక్షసుల నియమించినాడు అడుగడుగున హింసించుచున్నాడు

అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూర వలయమున || 147 ||                     

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

ఏ పూర్వ పాప ఫలుతమె కాని ఈ పాపాత్ముల పాలబడితిని

రఘుకులోత్తముడు నను బ్రోవునని వేచి వేచి వేసారి పోతిని

ఎంత కాలమీ వృధా ప్రయాసము ఆత్మహత్యయే నాకు శరణ్యము

అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూర వలయమున || 148 ||                     

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రావణుండు నాకు ఒసగిన గడువు రెండు నెలలలో తీరిపోవు

క్రూర రాక్షసులు ఆపై నన్ను హింసించెదరు కసి తీరగను

ఈ పాపులచే బలియౌటకన్న ఏ విషమె తిని పోవుట మిన్న

అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూర వలయమున || 149 ||                     

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

ఓ సీతా! నీ వెంత తెగువరివే మాటకు మాట ఎదురాడగలవే

నిను గోరుకొను లంకేస్వరునే కాదన గలిగియు బ్రతికే యుంటివే

ఎంతకు నీవు మాకు లొంగవని వెంటనె బోయి విన్నవింతుమని

కావలియున్న రాక్షస వనితలు కొందరు వెడలిరి రావణుకడకు || 150 ||                                

సుందరకాండ 2

Post a Comment

0 Comments