Polala Amavasya Vratha Katha - పొలాల అమావాస్య వ్రత కథ
Polala Amavasya Vratha Katha - పొలాల అమావాస్య వ్రత కథ |
ఒక ఊరిలో యేడుగురన్నదమ్ములుండిరి వారందరికి పెండ్లిండ్లై భార్యలు కాపురమునకు వచ్చిరి. కొంత కాలమునకా యేడుగురు తోటికోడండ్రు పోలాల అమావాస్య నోచుకొనవలెనని ప్రయత్నము చేసిరి కాని ఆ అమాస్యనాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవుటచే వారందరు నోము నోచుకొనలేదు.
ఆ విధముగా వారు ఆరు సంవత్సరములు నోము నోచుటకు ప్రయత్నము చేయుట, ఆమె బిడ్డ చచ్చుటయు, అందుచే వారందరు ఆ నోమును నోచుకొనుటకు వీలు లేకపోవుటయు, మిగిలిన ఆరుగురూ యేట ఆమెను దుమ్మెత్తుటయు జరుగుచుండెను. అట్లే యేడవ యేట కూడా వారందరూ నోము ప్రయత్నము జేసిరి. పూర్వమువలెనే ఆఖరియామె బిడ్డ చనిపోయెను, కాని ఆమె, తనను తిట్టిపోయుదురని భయపడి, చచ్చిన బిడ్డను యింటిలో పెట్టి తాళము వేసి మిగిలిన తోటికోడండ్ర యిళ్ళకు వెళ్ళి వారితో కలిసి నోమునోచుకొని రాత్రికి యింటికి వచ్చెను.
పిమ్మట ఆమె చచ్చినబిడ్డ శవమును భుజము మీద వేసుకొని వూరిచివరనున్న పోలేరమ్మ గుడ్డి వద్దకు తీసుకొనిపోయి, యేడ్చుచుండెను అమ్తలో గ్రామ సంచారమునకు బయలు దేరినపోలేరమ్మ ఆమెను చూచి "యెందుల కేడ్చుచుండి?" వని యడిగెను అందులకామె" అమ్మా! యేడ్వకేమి చేయమన్నావు ఏడేండ్ల నుంచి యేటికొక పిల్ల చొప్పున నేను పోలేరమ్మకు అప్పగించుచున్నాను.
ఈ బిడ్డ నేటి వుదయమునే చనిపోయెను. కాని ప్రతీ యేటా నా పిల్లలు పోవుటచే నా తోటికోడండ్రు నోము నోచుకొనక నన్ను తిట్టుట జరుగుచుండుటచేత, యీ యేడు నేను వారి నోము ఆగుట కిష్టపడక చచ్చినబిడ్డను యింటిలో దాచి, వారితో నోము నోచుకొని యిప్పుడు శవమును తోసుకొని వచ్చితిని" అనెను. ఆ మాటలు విని పోలేరమ్మ జాలినొంది, ఆమెకు అక్షతలిచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చినచోట చల్లి, చచ్చినవారిని వారి వారి పేర్లతో పులువ వలసినదిగా చేప్పి వెడలి పోయెను.
ఆమె అమ్మవారు చెప్పినట్లు తన పిల్లలను పాతిన గోతుల మీద అక్షతలను చల్లి చచ్చినవారిని పులువగా ఆ పిల్లలందరూ సజీవులై వెలుపలకు వచ్చిరి. అంతట ఆమె ఆ యేడుగురు పిల్లలను వెంటబెట్టుకొని యింటికి వెళ్ళెను. తెల్లవారుసరికి ఆమె తోటికోడళ్లు వూరివారు ఆ పిల్లలను చూచి "వీరెక్కడనుండి వచ్చిరి?" అని యడుగగా, ఆమె గతరాత్రి జరిగిన విషయములు దెల్పెను. ఆ మాటలకందరు ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పోలాల అమావాస్య నోము నోచుకొనుచు సుఖముగా నుండిరి.
దీనికి వుద్యాపనము లేదు ఇది అందరూ చేయవచ్చును. ఈ నోమును నోచుటవలన సంతానము లేనివారికి సంతతి కలుగును. సంతతి వున్నవారికి కడుపు చలువ కలుగును.
0 Comments