Sivadevuni Katha - శివదేవుని కథ

 Sivadevuni Katha - శివదేవుని కథ

Sivadevuni Katha - శివదేవుని కథ
Sivadevuni Katha - శివదేవుని కథ

తెలుగు దేశమున ఒకా నొక గ్రామ సీమలో బీదవాడగు "శివయ్య" అనే పేరు గల బ్రాహ్మణుడు నివసించు చుండెను. అతడు "రాజేశ్వరి" అనెడు మామెను పెండ్లాడి కాపురము చేయు చుండెను. కొంత కాలమునకా దంపతులు ఒక కుమారుడును, ఒక కుమార్తెయు కలుగిరి. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయణి బీదవాడగుట చేత శివయ్య బిక్షాటనము చేసి భార్యబిడ్డలను పోసించుకొనుచుండెను. లాగున కొంతకాలము గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు జెప్పెను.

          "మనము దరిద్రావస్థను భరించలేక పోతున్నాము నేను తిరుపతి పుణ్యక్షేత్రమునకు వెళ్లి స్వామిని దర్శించి, అక్కడ కష్టపడి కొంత దనమును సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూవుండు" మని శివయ్య ప్రయణమై వెళ్లుచుండగా ఒక ముదుసలి బ్రాహ్మణుడు ఎదురై " ఎవరు నాయనా నీవు" అని అడగగా, శివయ్య విధముగా చెప్పుడొడంగెను.

          "మహానుభావా! కనిపిస్తున్న పల్లెయే నా గ్రామము చాలా బీదకుటుంబీకుడను. ఒక భార్య, ఇద్దరు పిల్లలు కలరు. సంపాదించినది చాలక, దరిద్రబాధ భరించలేక తిరుపతికి వెళ్ళి దనార్జన చేయవలెననే తలంపుతో ఇల్లు విడచి బయలు దేరినాను" అని చెప్పగా, ముదుసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లనియె.

          " ఓయి! వెర్రినాయనా! తిరుపతికి వెళ్లినంత మాత్రమున, ప్రభుదర్శనం చేసినంత మాత్రమున నీవు ధనము సంపాదించుకోగలవా? నీకు సకలైశ్వర్యములు నిచ్చు వ్రత కథ ఒకటి జెప్పెదను శ్రద్దగా ఆలకింపుము" అని చెప్పగా అంత శివయ్య "పుణ్యపురుషా! అది దేవుని కథయె చెట్టునీడను గూర్చుని వివరింపుము స్వామి" అని వేడుకొనెను. అంతనా బ్రాహ్మణోత్తముడు శివుదేవిని కథ చెప్పుట ప్రారంభించెను.

          వంగదేశమును పాలించుచున్న శూరసేన మహరాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు. బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండియు శివదేవుని యందు అపారమైన భక్తిగలదై పూజలు చేయుచుండగా విషయము యజ్ఞవలయ్య మహముని భార్యయగు మైత్రేయి తెలుసుకొని తానే స్వయముగా సీమంతినికి సోమవార వ్రత మహత్యమును వివరించి చెప్పుటకు శూరసేన మహరాజు పట్టమునకు బయలు దేరి వచ్చి వ్రతవిధానము సీమంతినికి తెలియజేసి వెడలిపోయను. నాటి నుండి రాజుకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్దలతో చేయుచు సదాశివుని పూజించుచు వ్రతకథ చదువుచూ దినదిన ప్రవర్థమాన యగుచుండెను.

          ఇట్లుండగా అంగదేశమును "ఇంద్రసేన" డను మహరాజు పాలించుచుండెను. రాజునకు "చంద్రాంగదు" డను ఒక కుమారుడు కలడు. చిన్నవాడు సకల విద్యలు నేర్చుకొని పెండ్లి ఈడుకు వచ్చెను. చంద్రాంగదునకు వివాహము చేయవలెనను తలంపుతో ఇంద్రసేన మహరాజు తన కొలువునందున్న మంత్రి పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాంగదునకు ఎచ్చటనైన తగిన చినదానిని చూడమని చెప్పి, వారిని దేశదేశాలకు పంపెను. వారనేక దేశములు తిరిగి, కడకు వంగదేశ పరిపాలకుడగు శూరసేన మహరాజు పట్టణము చేరిరి. రాజునకు "సీమంతిని" అనెడు కుమార్తె కలదని పరిచారకుల వలన తెలుసుకొని రాజదర్శనమునకై స్ఠానమునకు వెళ్లిరి. అంత రాజు మంత్రి, పురోహితులను గౌరవించి, "తమరు వచ్చినపని ఏమి" టని అడిగెను. "మహరాజా! మాది అంగదేశము. మా ఇంద్రసేన మహరాజు గారికి చంద్రాంగదుడనే కుమారుడు గలడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచు తమ పుత్రికారత్నమగు సీమంతినిదేవి గుణగుణములు తెలుసుకొని ఇచ్చటకు వచ్చితిమి. ఇదుగో మా యువరాజు చిత్రపటము" అని చూపించినారు. రాజు చిత్ర పటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తము నిశ్చయించి మహా వైభవముగా వివాహము చేసేను.

          వివాహమైన కొంత కాలమునకు ఒక రోజున చంద్రాంగదుడు తన వినోదపు చెలికాండ్రతో యమునా నదీతీరమున నావపై షికారు చేయుచున్న సమయమున దురదృష్టవశమున నావ నీటిలో మునిగినది. చంద్రాంగదుడు తప్ప, మిగిలినవారు చనిపోయినారు. చంద్రాంగదుని నాగకన్యలు పట్టుకొని తమరాజు అయిన తక్షకుని వద్దకు తీసుకొనిపోయిరి. తక్షకుడు చంద్రాంగదుని చూచి "ఇతనెవరు? యిక్కడకు యెందులకు తీసుకొని వచ్చితిరి?" అని అడుగగా "మాకు తెలియదు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోవుచుండగా మాకు చిక్కుటవలన తమ వద్దకు తీసుకువచ్చితి"మని నాగకన్యలు పలికిరి. అంతనా తక్షకుడు దివ్యదృష్టి వలన చంద్రాంగదుని వృత్తాంతము తెలుసుకొని "ఇతడు సామాన్యుడు కాడు ఇతని ధర్మపత్ని సీమంతినీదేవి శివుని ఆరాధించుచు సోమవారవ్రత ప్రభావము గల మహపతివ్రత అందువలననే ఇతడు నీటిలో పడిపోయిననూ ప్రాణములు విడవక మీకు చుక్కుట వలన అతనికే విధమైన అపాయమును కలుగలేదు" అని నాగ కన్యలకు చెప్పెను.

           సంభాషణ నంతయు వినుచున్న చంద్రాంగదుడు భయపడుచు దిక్కులు చూడసాగినాడు. అంత తక్షకుడు చంద్రాంగదుని వీపు చరిచి, ధైర్యము కలుగజేసి తనవద్దనున్న విలువైన మణులు యిచ్చి, మణుల యెక్క ప్రబావము కూడ తెలియగేసి భూలోకానికి సాగనపినాడు.

            అక్కడ సీమంతిని తన భర్తజాడ తెలియకనందున నావ ప్రమాదములో చెలికాండ్రతో పాటు తనభర్త కూడా మరణించియుండునని తలపోసి పరిపరివిధాల విచారిస్తూ " శివదేవా! తల్లిపార్వతి! నేను విడవక ఆచరిస్తిన్న సోమవార వ్రతము యెక్క ఫలితము ఇదేనా!" యని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా స్వప్నములో జగజ్జనని" అమ్మాయి! నీ భర్తకు ఏమి భయము లేదు. విచారించకుము సజీవుడై యున్నాడు త్వరలో నీచెంతకు వచ్చును" అని చెప్పి అంతర్థానమయ్యెను. అంతలో ఆమె మేల్కాంచి స్వప్నములో దేవి చెప్పిన వాక్యములు వృధాకావని మనస్సున దైర్యము చేసుకొని యధాప్రకారముగా సోమవార వ్రతము చేస్తుండగా దివ్య ప్రభావము గల మణులతో చంద్రాగదుడు తన దేశమునకు తిరిగి వచ్చెను. ఇంద్రసేన మహరాజు కొడుకు రాకకు సంతసించి జరిగినదంతయు తెలుసుకొని తన కుమారుడు సజీవుడుగా నున్నాడనియు మహిమగల మణులతో తిరిగి వచ్చిననియు. శుభవార్తను శూరసేన మహరాజుకు కబురంపి శుభముహూర్తమున సీమంతినీ దేవికి చంద్రాంగదునకు వైభవోపేతముగా పట్టాభిషేకము చేసెను.

           సీమంతినీదేవి, చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావము గురించి శివదేవుని మహిమల గురించి బోదిస్తూ, ధర్మ మార్గమున రాజ్యపాలనము చేయుచుండిరి. సీమంతిని దేవి తన సోమవార వ్రత మహిమవలననే అయిదవ తనము కాపాడుకో గలిగినదని ప్రజలంతా భావించి, తాము కూడ సోమవార వ్రతము చేసి సకల సంపదలతో సుఖముగా ఉండి" రని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి "నీవు కూడా వ్రతము చేసినయెడల నీకును సకల ఐశ్వర్యములు సలుగు" నని చెప్పగా అంత శివయ్య అమితానంద మెంది " మహపురుషా! వ్రతమెట్లు జరుపవలెనో చెప్పవలసినది" గా కోరెను. అందుకా బ్రాహ్మణుడు విధముగా చెప్పసాగెను.

           "సోమవారము రోజున ఉదయముననే లేచి స్నానమాచరించి, గృహమును శుద్దిచేసి, రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీటమీద శివదేవుని పటముంచి, ఆవునేతితోగాని, కొబ్బరినూనెతో గాని దీపము వెలిగించి, శివదేవునికి టెంకాయకొట్టీ ధూపము వేసి, మారేడుదళములతో అభిషేకము చేసి, మూడు రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి, కొబ్బరి ముక్కలు తరగి పంచదారగాని లేక బెల్లముగాని కలిపి నైవేద్యము పెట్టి, శివ దేవుని వ్రతకథ చదివించి, ప్రసాదమును అందరికి పంచిపెట్టి తాముకూడ కండ్ల కద్దుకొని సేవించాలి. ఇలాగున మూడు సోమవారములు భక్తిశ్రద్దలతో పూజించిన యెడల సిరిసంపదులు కలిగి మనసులోని కోర్కెలు ఫలించు"నని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యుడయెను.

           కడు నిష్టతో వినుచున్న శివయ్య బ్రాహ్మణుని గానక " ఆహా! మహానుభావుడే నా పాలిట దేవుడు. నా అవస్థను చూచి నాకీ ఉపదేశము చేసెను " నని భావించి తిరిగి ఇంటికి వెళ్లి జరిగినదంతయు భార్యకు తెలియపరచెను. భార్యభర్తలు మూడు సోమవారములునూ భక్తిశ్రద్దలతో శివదేవుని పూజించి ప్రసాదము ఇరుగుపొరుగు వారికి పంచి పెట్టీ సుఖముగా వుండగా వారికి దరిద్ర బాదలు పోయి అష్టయిశ్వర్యములు లుగినవి. కొన్నాళ్లకు ధనగర్వముచే వ్రతము చేయడం మానివేసినారు శివదేవునకు కోపము వచ్చి వీరి గర్వమణచవలెనని మళ్ళి దరిద్రులుగా చేసెను.

          దరిద్ర దశలోనున్న శివయ్య మరల యధా ప్రకారముగా భిక్షాటనకు ఒక గ్రామమునకు వెళ్ళి  యాచించగా. " వేళ మేము శివదేవుని పూజ, సోమవార వ్రతం చేసుకొంటున్నాము. ఇప్పుడు భిక్షవేయుటకు వీలు లేదన్నారు. "అయ్య! సోమవార వ్రతం మరచిపొయినందుననే ముకీగతి పట్టినది చాలా అపచారము చేసినాము" అనుకొనుచూ ఇంటికి వెళ్ళి సంగతి భార్యకు జ్ఞాపకం చేసినాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయక, మెండిగా మాట్లాడినది గత్యంతరం లేక శివయ్య, పిల్లలతో నదిలో స్నానము చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొనుచు భార్యను వినిటకు రమ్మని పిలిచెను. తాను కథ కూడా వినను అని చెప్పగా, మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండపోయినవి. భర్తయగు శివయ్య " ఓసి పిచ్చిదానా! శివదేవుని పూజ మానినావు, కథ కూడా వినన్నావు నేను బీదవాడనైతిని, నీవు అంధురాలవైతివి కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకోమని గట్టిగా మందలించినాడు. భార్య అలాగున చేసి స్నానమాడి, సోమవారం వ్రతము మాచరించి ప్రసదమును కండ్లకద్దుకొని సేవించెను. వెంటనే కన్నులు కనిపించినవి. పోయిన ఐశ్వర్యము గల్గినది. నాటి నుండి ప్రతి సోమవారము దంపతులతో పాటే గ్రామస్తులు కూడా శివదేవుని మారెడు దళములతో పూజిస్తూ సకలైశ్వర్యములతో తులతూగుతున్నారు. కాబట్టి, సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖములు, పరమందు మెక్షమును పొందుదురు.

        కథ వినిన వారికి చదివిన వారికి సాంబశివుడు సకలైశ్వర్యములు ప్రసాదించునని సూత పౌరాణికుడు శౌనకాది మునులకు బోదించెను.

Facebook

అరుణాచలం శివ చాలిసా

Post a Comment

0 Comments